ఒకేరోజు 9851 కేసులు, 273 మరణాలు!
దిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. భారత్ లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కొవిడ్19 బారినపడ్డ వారి సంఖ్య 2,26,770కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజు 200పైగా కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 273మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 6348కి చేరింది. దేశంలో కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకోగా మరో 1,10,960 మంది చికిత్స పొందుతున్నారు.